Monday 21 March 2011

దాన వీర శూర కర్ణ సుయోధనుడి డైలాగ్స్

1.సుయోధనుడు ద్రోణుడి జాత్యాహంకారాన్ని  వ్యతిరేకించుట
ఆగాగు!
ఆచార్య దేవ, హహ్హ  ఏమంటివి? ఏమంటివి ?

జాతి నెపమున సూత సుతునకిందు నిలువ అర్హత లేదందువా !

ఎంత మాట,  ఎంత మాట ! ఇది క్షాత్ర పరీక్షయే కాని క్షత్రియ  పరీక్ష కాదే ?

కాదు కాకూడదు ఇది కులపరీక్షయే  అందువా !

నీ తండ్రి భరద్వాజుని జననమెట్టిది ? అతి జుగుప్సాకరమైన నీ సంభవమెట్టిది ?
మట్టి కుండలో పుట్టితివికదా ! హహ్హ నీది ఏ కులము?

ఇంతయేల, అస్మతపితామహుడు కురుకుల వృద్ధుడైన  ఈ శాంతనవుడు శివసముద్రుల భార్యయగు  గంగా గర్భమున జనియించలేదా ! ఈయన దే కులము ?

నాతోనే చెప్పింతువేమయా  , మా వంశమునకు మూలపుర్షుడైన వశిష్టుడు దేవవేస్యయగు  ఊర్వశీపుత్రుడు కాదా ?
ఆతడు పంచమజాతి కన్యయగు  అరుంధతియందు శక్తిని, ఆశక్తి చండాలాంగానయందు పరాశరుని, ఆ పరాశరుడు పల్లెపడుచు మత్యగంధియందు మా తాత వ్యాసుని, ఆ వ్యాసుడు  విధవరాండ్రైన మా పితామహి అంబికతో మా తండ్రిని , పినపితామహి అంబాలికతో మా పినతండ్రి పాండురాజును , మా ఇంటిదాసితో ధర్మనిర్మానజనుడని మీచే కీర్తింపబడుచున్న హ..  ఈ విదురదేవుని కనలేదా?

సందర్భావసరములనుబట్టి  క్షేత్రభీజప్రాదాన్యములతో సంకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది, కాగా, నేడు కులము.. కులము అను వ్యర్ధవాదములెందుకు?


2.కర్ణుడి పట్టాభిషేకం 


ఓహో ! రాచరికమా అర్హతను నిర్ణయించునది.
అయిన మాసామ్రాజ్యములో సస్యశ్యామలమై సంపదవిరాళమై వెలుగొందు అంగరాజ్యమునకిప్పుడే  ఈతని మూర్ధాభిషిక్తుని గావించుచున్నాను.

సోదరా..   దుశ్శాసన ! అనఘ్రనవరత్న కిరీటమును వేగముగా గొనితెమ్ము,

మామా.. గాంధారసార్వభౌమా ! సురుచిరమణిమయమండిత సువర్ణ సింహాసనమును తెప్పింపుము,

పరిజనులారా ! పుణ్య భాగీరథీనదీతోయములనందుకొనుడు,

కళ్యాణభట్టులారా ! మంగలతూర్యారవములు సుస్వరముగ మ్రోగనిండు,

వంధిమాగధులారా ! కర్ణ మహారాజును కైవారము గావింపుడు,

పుణ్యాంగనలారా ! ఈ రాధాసుతునకు పాలభాగమున  కస్తూరీతిలకము తీర్చిదిద్ది
బహుజన్మసుకృతప్రదీపాదిసౌలబ్ద సహజకవచకచవైడూర్యప్రభాదిత్యోలికి వాంచ్చలుచెలరేగ వీరగంధమువిదరాల్పుడు.

నేడీ సకలమహాజనసమక్షమున, పండితపరిషన్మధ్యమున సర్వదా సర్వదా, శతదా సహస్రదా ఈ కులకలంక మహాపంకిలమును శాశ్వతముగా ప్రక్షాళనము గావించెదను .

హితుడా ! అప్రతిహత వీరవరేణ్యుడవగు నీకు అంగరాజ్యమేకాదు.. నా అర్థ సింహాసనార్హత నిచ్చి గౌరవించుచున్నాను.


3.సుయోధనుడికి పాండవుల రాజసూయాగం ఆహ్వానం వచ్చినప్పుడు 

ఊం.. ఉ..  హహహహ

విరాగియై పాండురాజుకు సరాగినియై కులప్రవర్తనాసక్తయైన కుంతికి జనియించిన పాండవులు !

ఆబాల్యమున ఆటపాటలలో మమ్ము అలమటపెట్టిన పాండవులు !


లాక్కాగృహములో నిశీధిని నిట్టనిలువునా ధహించివేసారన్న నీలాపనిందను మామీద వేసిన పాండవులు !

ఏకచక్రపురమున విప్రవేషములతో ఇల్లిల్లు తిరిపమెత్తి పలుకు వళ్ళుమెక్కిన పాండవులు !

అంతకుతగ్గగంతగా అతుకులబొంతగా ఐదుగురు ఒకే కాంతను పరిణయమాడిన పాండవులు !

స్నాయువతా సంకలిత శల్యము సంప్రాప్తించిన సుంకంమ్మన్నటుల
మా పిత్రుదేవదయాలభ్ధమైన ఇంద్రప్రస్థ వైభవముతో    నేడీ యాగకార్యదుర్వహుగులగుటయా !

నరకలోకముననున్న తమ తండ్రిని యమలోకమునుండి స్వర్గలోకమునకు
జేర్చుట దీని ఆంతర్యమట ! ఏమి కల్పనాచాతుర్యము ? ఏమి కల్పనాచాతుర్యము ?

ఐనను కుంతీ మూలమున స్వర్గనరకాధిపతులిరవురు  పాండురాజునకు తమ్ములేగదా !
ఐన ఇందు జరుగనిదేమి ? లోపమేమి ?

అయ్యారే ! సకలరాజన్యులోకమూ సోహోనినాదములు సలుప భారతభారతీ శుభాస్సీసులతో పరిపాలనసాగించెడి మాకు మారాటుగా సార్వభౌమత్వము సాదింపగోరి  పాండవుల దుష్ప్రయత్నమా ఇది !

సాటిరాజులలో రారాజు కావలెననియెడు ధర్మజుని దుష్టంతరమా ఇది !
ఐనచో  కుతంత్రముతో కుచ్చితబుద్ధితో  సేయనెంచిన ఈ రాజసూయము  సాగరాదు,  మేమేగరాదు.


4.మయసభ ఘట్టం 


అహొ !
అమ్లానభావసంభావితమైన  ఈ దివ్యప్రసూనమాలికారాజమును కురుసింహుని గళసీమనలనలంకరించిన వారెవ్వరు ? అ.. హహహ ..

అనిమిషయామినీ  అతిధిసత్కార  దివ్యసేవాప్రభావమౌనా ! ఔ,, ఔ,,

ఆ.. హహ్హహ,,
ఓ..
ఆ.. ఏమా సుమధుర సుస్వరము !
కాకలీకలకంటికంటి  కూకూఉకారసుతిహిత దివ్యసురకామినీ కామినీయక సుస్వాగతమౌనా ! హాహ్హహ.. అహా .
సొబగు సొబగు.. సొబగు సొబగు..

ఔరా.. ఇది శాస్త్రవిజ్ఞాన ప్రభావమా ! హాహ్హహ..
ఔ.. ఔ..

అయ్యారే !
భ్రమ.. ఇదినా భ్రమ ..
కించిత్ మధుపానాసక్తమైన మా చిత్త భ్రమ..

భళా !
సముచితసత్కారస్వీకారసంత్రుప్తస్వాంతుడనగు ఈ కురుభూకాంతుని సంభావనాసంభాషణాభూషణములచే  ఈ సభాభవనము ధన్యము..ధన్యము..

అకుంచితనిర్మాణచాతురీదుర్యుడవగు ఓ మయబ్రహ్మా.. నీ శిల్పచాతురీమధురిమ ఆ బ్రహ్మకుగాని విశ్వబ్రహ్మకుగాని   లేదు.. లేదు.. లేదు ..

ఆ.. లేవచ్చును, లేకపోవచ్చును.. కాని పాండవహతకులకిట్టి పరిషత్తు లభించుటమాత్రం మానధనులమైన మాబోంట్లకు దుస్సహము.

విశ్వవిశ్వంబరావినుతశాశ్వతమహైశ్వరీమహైశ్వరులము కావచ్చు..

అఖిల నదీనదసాగరవారిదర్గర భూకృత అనఘ్రముక్తామణీమ్రాతమ్ములు మాకుండిన ఉండవచ్చు..

సాగరమేఘరాసతీకరగ్రహణంబోనర్చి సార్వభౌమత్వమందిన అందవచ్చు..

కాని ఇట్టి సభాభవనము  మాకు లేకపోవుట మోపలేని లోపము.

చతుర్కృతాపచారములకంటే శత్రు వైభవము శక్తిమంతుల హృదయములకు దావాలనసధృశము. ఇక మేమిందుండరాదు.

ఏమీ ! నిరాఘాటపదట్టనకు నాకీ కవాటఘట్టనమా ! పరులేవ్వరు లేరుకదా ! మా భంగాపాటును పరికించలేదుకదా!

ఇస్సీ! ఈమయసభను మాకు విడిదిపట్టుగా పెట్టుట నిస్సందేహముగా ఆ పాండవ హతకులు మమ్ము అవమానిచుటకే.

ఆ.. ఏమీ ! సభాభవన గర్భమున సుందర జలచరసంతియైన  జలాశయమా ! ఆహ్

అంతయు మయామోహితముగా ఉన్నదే !

ఉ.. అహ్హహ్హ.. ఇదియును అట్టిదియే.. అహహ్హహ...

పాంచాలీ... పంచభర్త్రుక ...

వదరుపోతా.. వాయునందనా ...

పాంచాలి..  పంచభర్త్రుక..  ఏమే.. ఎమేమే..  నీ ఉన్మత్తవికటాట్టహాసము ?  ఎంత మరువయత్నించినను మరపునకురాక హృదయ శల్యాభిమానములైన నీ పరిహాసారవములే నాకర్ణపుటములను వ్రయ్యలు చేయుచున్నవె.

అహొ   ! క్షీరావారాసిజనితరాకాసుధాకర వరవంశసముత్పన్నమహొత్తమ క్షత్రియ పరిపాలిత భరతసామ్రాజ్యదౌరేయుండనై ...

నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశభువన శూరవరేణ్యులగు శతసోదరులకు అగ్రజుండనై ...

పరమేశ్వర పాదాభరిత పరశురామ సద్గురుప్రాప్త శస్త్రాత్రవిద్యాపారియుండైన రాధేయునకు మిత్రుండనై..

మానధనుడనై  మనుగడ సాగించు నన్ను చూచి ఒక్క ఆడుది పరిచారికా పరీవృతయై పగులబడి నవ్వుటయా ?

అహొ ! తన పతులతో తుల్యుడనగు నను భావగా  సంభావింపక, సమ్మానింపక.. గృహిణిధర్మ పరిగ్దగ్ధయై.. లజ్జావిముక్తయై.. ఆ పంతకి పాంచాలి ఎట్టఎదుట యేల గేలి సేయవలె ?

అవునులే.. ఆ బైసిమాలిన భామకు ఎగ్గేమి ? సిగ్గేమి ? వొంతువొంతున  మగలముందొక మగనిని వచ్చనపర్యంతము  రెచ్చిన కడుపిచ్చితో పచ్చిపచ్చి  వైభవమున తేలించు ఆలి గేలి సేసిన మాత్రమున హహ.. హహ.. మేమేల కటకట పడవలె ?

ఊరకుక్క ఉచితానుచిత జ్ఞానముతో మోరెత్తి కూతలిడునా !  ఆ.. అని సరిపెట్టుకొందున ! ఈ లోకమును మూయ మూకుడుండునా !

ఐనను దుర్వ్యాజమున    సాగించు యాగమని తెలిసి మేమేల  రావలె ... వచ్చితిమి పో !

నిజరత్నప్రభాసమపేతమై సర్వర్త్రు సంశోభితమైన ఆ మయసభాభవనము మాకేల విడిది కావలె.. అయినది పో !

అందు చిత్రచిత్ర విచిత్ర లావణ్య లహరులలో ఈదులాడు విద్రుక్షాపేక్ష అహ్హా.. మాకేల కలుగవలె ...  కలిగినది  పో !

సజీవ జలచర సంతాలవితాలములకు ఆలవాలమగు ఆ జలాశాయములో మేమల కాలు మోపవలె .. మోపితిమి
పో !

సకల రాజన్యుకోటీరకోటిసంక్షిప్త రత్నప్రభా నీరాజితంబగు మాపాదపద్మమేల అపభ్రమనం  చెందవలె..  ఏకత్సమయమునకే  పరిచారికాపరీవృతయై  ఆపాతకి  పాంచాలి  యేల రావలె..వీక్షించవలె.. పరిహసించవలె ?

ఆ విధి.. హా విధి.. హా హతవిధీ..

ఆజన్మ శత్రువులేయని అనుమానించుచునే అరుదెంచిన మమ్ము అవమాన బడబానలా జ్వాలలు  ధగ్ధమోనర్చుచున్నవి మామా..

విముఖునిసుముఖునిజేసి మమ్మితకు విజయముసేయించిన నీ విజ్ఞాన విశేష విభావాదిత్యములు ఏమైనవి మామా ?

పాంచాలీ కృతావమాన మానసుడనై, మానాభిమానవర్జితుడనై మర్యాదాతిక్రమనముగా మనుటయా.. లేక పరిహాసపాత్రమైన ఈ బ్రతుకోపలేక మరణించుటయా..

ఇస్సీ.. ఆడుదానిపై పగసాదింపలేక అశు పరిత్యాగము గావించినాడన్న అపఖ్యాతి ఆపైన వేరొకటియా...

ఇప్పుడేదీ కర్తవ్యము ?  మనుటయా? మరణించుటయా ?



5.మాయాజూదంలో సుయోధనుడు గెలిచినపుడు 


మాయురే మామా.. మాయురే  హహహః
చరిత మరువదు నీ చతురత.. మాట చెల్లించిన నీకే దక్కును యెనలేని ఘనత
మా ఎద సదా మెదలును మామ యెడ కృతజ్ఞత .

ప్రాతిగామి ! ఆ వంచకి పాంచాలిని ఈ సభకు ..

ఓహో
వయోవృ ద్దులు , గురువృ ద్దులు ధర్మబుద్ధులమనుకొను ప్రబుద్ధుల బుద్ధి ఇంత దనుక నిదురబోవుచున్నదా ఏమి ? హహ్హ.. హహ్హ.. ఇప్పుడే లేచి అధర్మము అధర్మమని  ఆవులించుచున్నది.

జూతం ధర్మవిరుద్ధము సప్త మహా వ్యసనములలో నీచాతి నీచమైనదని తెలిసియు  ఇంతదనుకా మీరేల వీక్షించితిరి?

ఐనను జూతక్రీడారతుడగు ధర్మసుతునితో మామను సరిజోదునుచేసి ఆడించితినే కాని చతుషష్టి కళా విశారదుడనగు  నేనాడలేదే ! ఆట తెలియకనా  ? హహహ.. ధర్మమూ తెలియును గనుక.

కాని ధర్మాధర్మములు విచారింపక తన తమ్ముల విక్రమోపార్జితములైన సంపదలను, మా తండ్రి దయాలబ్ధమైన ఇంద్రప్రస్థమును తన  ఒక్కని సొత్తే  ఐనటుల ఈ పాండు సుతుడు ఒడ్డినపుడు ఇది ధర్మము కాదని మీలో ఒక్కరైనను పెదవి కదపిరా ?

తమనొడ్డినపుడైన    తమ్ములు  నోరు మెదపిరా ?

ఆలిని ఓలిగా పెట్టినప్పుడైన ఆ మగువను మగటిమితో మత్స్య యంత్రము కొట్టి తెచ్చుకొన్న వాడను నేను పాంచాలిపై మీకేమి అధికారమున్నదని అర్జునుడైన అన్న నడిగెన ?

చతుర్విధ పురుషార్ధములలో సహధర్మచారిణి ఐన ధారను దయారహితముగా పందెము వైచునప్పుడైనను, అవ్వ ! ఇది  అమానుషమన్నవారులేరే    ?

అ.. ఆ..
నేను గెలచుటచే మయా తిరోతరమైనది , ధర్మజుడే గెలచిన ధర్మమే జయించినదని    మీరు జేజేలు కొట్టిఉండెడి  వారు కాదా !

మీ పాండవ పక్షపాత బుద్ధితో ధర్మ దేవతను ఖండించి అధర్మ దేవతను ప్రళయ తాండవ మాడింపకుడు ..

తాతా! అలనాడు స్వయంవర సమయమున నా కూర్మి మిత్రుడగు కర్ణుని సూతకుల ప్రసూతుడని వదరి వర బహిష్కారము చేసిన ద్రుపదునకు బుద్ధి చెప్పుటకు ఇది ఒక ప్రయత్నం.

నాడు నను అతిధిగా ఆహ్వానించి  పరిహసించిన పంచ భర్త్రుక పాంచాలి పై పగ సాధించుటే దీని ఆంతర్యం.

అంతియేకాని మా పితృ  దేవ దయాలబ్ధమైన ఎంగిలి కూటికాశపడు  అల్పుడను కాను, అందునా జూతార్జితమగు విత్తము పై చిత్తము నుసిగొల్పు అధముడను కాను.

నా హృదయాగ్నిజ్వాలా ప్రతిరూపమే ఈ జూతము తాతా,  ఆ ప్రతీకార జ్వాలలే పాంచాలిని ఆవరించినవి. మర్మ ధర్మములతో, పక్షపాత బుద్ధులతో పాతక కర్మలతో మనుగడ సాగించు మీరీ మహాసభలో మాట్లాడ అనర్హులు. మీ హితోపదేశం కట్టిపెట్టండి, కూర్చోండి.



6.కృష్ణ రాయభారానికి సుయోధనుడి ప్రత్యుత్తరం 


రాయభారీ... చాలించు నీ దుష్ప్రసంగం..

పితామహ, గురుదేవ, తల్లిదండ్రులారా.. సభ్యమహాజనులారా.. నా క్షేమము కోరి పలికిన మీ హిత వాక్యములకు కృతజ్ఞుడను.

రాయభారీ.. గోకులవిహారి .. హహహ్హ..
నీవెంత తెలివితేటలతో ప్రసంగించినను  నీ అంతరాత్మను నీ పలుకులలోని అంతరార్ధమును  తెలియని అజ్ఞానిని కాదు..

మా గురుదేవునకు సోదరుడవని, కుంతీ దేవి మూలమున మాకు దూరపు చుట్టమని సకల రాజలాంఛనాలతో , సమస్త సత్కారాలతో అతిధిగా ఆహ్వానించగా తిరస్కరించి నీకు నీవే రాయభారిగా ప్రకటించు కొంటివి. పగతుర కూడు కుడువనున్నదని నిన్ననే మమ్ము పగవానినిగా భావించితివి .

ఐనను, రాయభారి వచ్చునపుడు రారాజు ఆసనము నుండి లేచుట ఆచారము కాదు గనుక నిన్ను ఉచితరీతినే  గౌరవించితిని.

ఊం..
రాయాభారిగా వచ్చినవాడవు పంపిన వారి మాటలు ప్రకటింపక  , ఆపైన మా అభిమతము గ్రహింపక  ఇంతః ప్రల్లదనముగా ప్రవర్తించితివి.

ఇప్పుడు నేను సంధికొడంబడినచో  హహ్హ..  హహ్హ.. సౌజన్యముతో డాయాదులకు పాలుపంచి ఇచ్చినట్లా  ? లేక, నీవు వంధిగా  వర్ణించిన  వారి బలపరాక్రమాలకు లకు బెదరి ఇచ్చినట్లా ?

దూతగా వచ్చినవాడవు దూత కృత్యములు నిర్వహింపక పాతక కృత్యములకు కదంగితివి, మాలో మాకు కలతలు కల్పించి మా మైత్రీ బంధమును తెంచుటకు తెగించితివి

హ..హహ.. ఐదూల్లైనా   ఇవ్వని పరమ దుర్మార్గుడు రారాజని ఈ లోకమునకు చాటనెంచితివి
కృష్ణా !  నీ కోరిన కోర్కె సరియే ఐనచో,  నిజమే ఐనచో  నేనీయుటకీ  సువిశాల సామ్రాజ్యములో ఐదూళ్ళు లేకపోవునా !

ఇంద్రప్రస్థము, కృతప్రస్థము, జయంతము, వారణావతములతో ఇంకొకటి కలిపి ఐదూళ్ళు ఇచ్చిన చాలంటివి. నాకు లేనివి, నావికానివి,  నేను ఇతరులకు దానమిచ్చిన ఆ నగరములను నేను వారికెట్లు కట్టబెట్ట గలను? ఆ .. ఇది సాధ్యమా ? సంధి పొసగు మార్గమా ? హ..హహ..

ఇది గాక ...
మా పినతండ్రి కుమారులకు భాగమీయమంటివి.. ఎవరు నాకు పినతండ్రి ?

పాండురాజా  ? యమధర్మరాజా  ? వాయువా ? ఇంద్రుడా ? అస్వనీదేవతలా ? కృష్ణా ! శ్రత శృంగపర్వతమున పుట్టిన కౌంతేయులకు భాగమిచ్చి  శృంగభంగమొందుటకు   హ..హహ నేనంత వెర్రివాడిననుకుంటివా ?

ఒకవేళ భాగమే పంచవలసివచ్చిన, ఈ గంగా తనయుడు పాలు వదలుకొన్నను ..

మా పిన పితామహులగు భాహ్లిక సోమదత్తులకు అందు భాగము లేదందుమా ?

అందందు వచ్చిన అర్థార్థ భాగములలో మా తండ్రులు దృతరాష్ట్ర పాండురాజు లిరువురు భాగస్వాములు కదా ? ఆపైన మేము నూర్గురము వారైదుగురు నూటైదుగురము  కదా ! ఇందరమూ వంతులు వేసుకొన్నచో  హ..హహ..   ఎవరికి ఎంత.. ఎంత… ఎంత వచ్చును.

అసలీ అవిభాజ్య కురుమహాసామ్రాజ్యాన్ని ముక్కలు చెక్కలుగా చేయుట దేశమునకు  శ్రేయస్కరమా ?

భిన్న భాషలతో భిన్న సంస్కృతులతో భిన్న నాగరికతలతో దేశము చిన్నాభిన్నమైనచో ప్రజలకది సౌభాగ్యమా ?

ప్రజలందరు ఒకే కుటుంబముగా ఒకే పాలన క్రింద ఉండుట క్షేమము కాదా?  కృష్ణా ఈ యుగధర్మము ప్రకారము ఆస్తి పదమూడు సంవత్సరములు పరాధీనమైనచో దాని పై హక్కులు శాశ్వతముగా  తొలగునన్న  సత్యము నీవెరుగవా?

అందులకే జూతమునకా నియమము పెట్టితిమి కాని,  మతిమాలి కాదు.

అయినను జూతానంతరము ద్రౌపది మా తండ్రి గారిని కోరిన కోర్కెలు రెండు ..
మొదటిది ధర్మరాజు దాస్యవిముక్తి   రెండవది తన నలుగురు భర్తల దాస్యవిముక్తి , అంతియే కాని .. నాడు ద్రౌపది తన దాస్యవిముక్తిని కోరనూలేదు మా తండ్రిగారీయనూలేదు . కనుక ఆమె ఇప్పటికి మా దాసియే . కృష్ణా! వారీనాడు రాజ్యభాగము కోరినట్లు మేము పాంచాలిని కోరినచో తిరిగి వారామెను మాకు అప్పగించ గలరా ? సిగ్గులేక వారు పంపిన పంపవచ్చును గాని , ఎగ్గులేక నీవంగీకరించి రావచ్చునా ?

ఇక నీ బెదరింపులందువా ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్ళ కొరకు  ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !

కృష్ణా ! ఇంతయేల , ఆ కౌంతేయులకు వాడిసూది మొనమోపినంత భూమికూడా ఈయను . ఇదియే   నా తుది నిర్ణయము .


Sunday 20 March 2011

దాన వీర శూర కర్ణ - భగవత్గీత (తెలుగు)


భగవత్గీత (తెలుగు)
ఏల సంతాపమ్ము ! మరి నీకేల సందేహమ్ము పార్థా !
మృతులకై జీవితులకై పండితులు దుఖ్ఖితులగుదురా
కర్మమ్ముల  యందె నీకు కలదదికారము లేదు కర్మ ఫలములందు
కాన కర్మమ్ములు విడువరాదు
పుట్టినందుకు చావు తప్పదు గిట్టినప్పుడు పుటక తప్పదు
పరిహరింప లేనిదానికి పరితపించకు ఓ పరంతపా
ఆత్మ నిత్యము ఆత్మ సత్యము అది చింత్యము అది అగమ్యము
చీల్చలేనిది కాల్చలేనిది సర్వగతమది
చంపెడివాడవు నీవా చంపబడెడివారలు  వీరా
చేసెడివాడను నేనే చేయించెడివాడను నేనే
ఎన్నడు ధర్మము తరుగునో ఎప్పుడు అధర్మము పెరుగునో
అప్పుడు సృ ష్టించుకొందు అర్జునా నను నేనే
దుష్టుల శిక్షించుటకై శిష్టుల రక్షించుటకై సద్ధర్మస్థాపనకై
సంభవింతు యుగయుగముల
అన్నిధర్మములు త్యజించి నన్నే శరణము గొందుము
సర్వపాప విమోచనము జరిపి మోక్షమోసంగెదను

Tuesday 15 March 2011

పాండవ వనవాసం

ఓరోరీ మాయాజూదవిజయమధమధోన్మత్త ! దుర్యోధనా !
నీ దురహంకారానికి  తగిన ప్రతీకారం తీర్చుకుంటాను
ధారుణి రాజ్యసంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమ్ముననున్దగబిల్చిన,
ఇద్దురాత్ము దుర్వార మదీయ భాహుపరివర్తిత చ్చండగధావిఘాత భగ్నోరుతరోరు  జేయుదు
సుయోధనున్ ఉగ్ర రణాన్తరంబునన్

ఓరోరీ  కురుకుల దార్తా  దుశ్శాసనా!
కురువృద్ధుల్ వృద్ధభాన్ధవులనేకుల్ జూచుచుండ  ద్రౌపదినిట్లుచేసిన ఖలున్ దుశ్శాసనున్
లోకభీకరలీలన్ వధియిన్చి, తద్విపులవక్షస్తలరక్తౌగ నిర్ఝరి ఉర్వీపతుల్ జూచుచుండ అని
ఆస్వాదిన్తును ఉగ్రాకృతిన్

మాయలతో జనియించి మటుమాయల వృత్తిగానెంచు నీవు,
అహొ  ! మాయలనిందసేతువే ?
అమాయకులైన పృధాకుమారులన్ మాయలుపన్ని  నాడు అవమానము చేయగలేదే?
ఆ గతిన్ మాయలతోనే నీ దురభిమానము మాపెదన్ సుయోధనా !

శ్రీకృష్ణావతారం

(శ్రీకృష్ణ స్తోత్రం  )
శృంగారరస సర్వస్వం సిఖిపింఛ విభూషణం
అంగీకృత నరాకారం ఆశ్రయే భువనాశ్రయం
ఆశ్రయే భువనాశ్రయం

(శ్రీకృష్ణుడు   అర్జునిడి తో) 
ఊరక చూచుచుండమనుట  ఒప్పుదుగాని  భవత్గ్రహస్తు నన్
బారగాజూచి నీరిపులు  ఫక్కున నవ్వి అనాదరింతురు
ఆశూరకులంబు మెచ్చ రిపుసూధన తాబరమూను నీకు నే సారధినై
విజయసారధి నామంబునన్ చరించెదన్.. విజయసారధి నామంబునన్ చరించెదన్


(శ్రీకృష్ణుడు ఆశ్వత్హామ  తో కర్ణుడి గురించి ) 
సేవా ధర్మము సూత ధర్మము రాశీభూతమైవొప్ప 
వాచావాత్సల్యము జూపే కర్ణుడిటు మాత్సర్యంబు మీకేల 
రాజేవేళన్ మిముగోరునో అనికి నాడే పొండు  పోరాడ
లేదా..  వర్జింపుడు కర్ణు చావువరకో ఆధ్యంతమో యుద్ధమున్
వాచావాత్సల్యము జూపే కర్ణుడిటు

(భగవత్గీత  తెలుగు లో క్లుప్తంగా )
తనువుతో కలుగు భాంధవ్యమ్ములెల్ల తనువుతో నశియించి ధరణిలో గలియు
తనువనిత్యము నిత్యమ్ము ఆత్మ ఒకటే.
చినికి జీర్ణములైన చేలముల్ వదలి క్రొత్త వలువలు గట్టికొన్నట్టి రీతి
కర్మానుగతి ఒక్క కాయమ్ము వదలి వేరొక్క తనువు ప్రవేశించు నాత్మ  
ఆత్మకు ఆదియు  అంతమ్ము లేదు  అది గాలికెండదు, అంబుతో తెగదు,
నీట నానదు అగ్ని నీరైపోదు

కరుణా విషాదాలు కలిగించునట్టి  అహమ్మును మమకారమావలనెట్టి  
మోహమ్ము వీడి ప్రబుద్ధుడవగుమా

ఒక్కడు చంపు వేరొక్కడు చచ్చుననుమాట పొరపాటు, ఆ భ్రాంతి విడువుము
పురుషుల ఉత్తమపురుషుండ నేనే కనులకు దోచు  జగమ్ము  నేనే జగదాత్మను నేనే
జగము సృజియించి పోషించి లయమును గావింతు నేనే

స్వార్ధమ్మునకు ధర్మమాహుతిజేసి మదమత్సులై పేరు మానవకోటి నాసంము జేయ సంకల్పించినాడ ఈ రణయజ్ఞమ్ము నెవ్వరు ఆపలేరు మృత్యు ముఖమ్ములో మెదగుచున్న రాజలోకమును రక్షింపలేరు
నాచేత హతులైన నరనాయకులను వందింప నిమిత్త మాత్రుండ వీవు   భీష్మాది కౌరవ వీరలోకంబు నా గర్భమున మహానలకీనలందు కాలుచున్నారు ఇదే కనుము కౌంతేయా

సీతారామ కల్యాణం

లక్షీదేవి స్తోత్రం
పద్మాసనే, పద్మినిపద్మహస్తే, పద్మాలయే, పద్మదళాతాక్షే
విశ్వప్రియే, విష్ణుమనోనుకూలె త్వా పాదపద్మౌ మైసన్నిదశ్యా .

(లంకానగరం ఇలా  ఉంటుందని చెప్పే పద్యం) 
సష్టిర్యోజన విస్తీర్ణం,  శతయోజన  ఉన్నతం
అష్ట ద్వారపురే లంక సప్త ప్రాకార శోభితం
త్రికోణ సంఘసంసేవా నవకోటి శివాలయం
చాతుర్లక్ష్యంచరీ  దీవినా రావణేన సురక్షితం

(విష్ణు భక్తులను వేదించమని చెప్తూ రావణుడు)
దానవకులవైరి దర్పంబు వర్ణించు చదువులెవ్వరుగాని చదువరాదు
సురపక్షపాతి విస్పురణకై గావించు యాగమ్ములేమియు సాగారాదు
అమరుల వేడుకై ఆచరించేది యజ్ఞ గుండంబులందగ్ని మండరాదు
హర నామమేగాని హరి నామ గేయమ్ము త్రిజగాలనెవ్వారు స్మరించరాదు
అమరలోక విజేత  లంకాధినేత హహ... హహా..
అమరలోక విజేత  లంకాధినేత రావణుని శాసనములు నిరాకరించు
విష్ణు దాసుల బట్టి కేల్ విరచికట్టి   చెరనుబెట్టుడు దానవశ్రేష్టులారా.

(రావణుడు ఈశ్వరుణ్ణి  ప్రసన్నం చేసుకునే ముందు) 
పరమశైవాచారపరులలో అత్యంత ప్రియుడన్న యశము కల్పించినావు
తల్లికోరిక తీర్పతలచినేరక ఆత్మలింగమ్ము చేతనోసంగినావు
మును కుభేరుని కోరికై  లంకాపురి విభవమ్ము మరల ఇప్పించినావు
తలచుటేతడవుగ దర్శనభాగ్యమ్ము కరుణించి నీదరి కాచినావు
స్వామీ భవదీయ దర్శనోత్సాహినగుచు తరియ ఈవేళా ఈ విశేషంబులేలా
వైరమేలయ్య మరచి నా నేరములను  కరుణగలవయ్య కైలాసగిరినివాసా కైలాసగిరినివాసా


(రావణుడు ఈశ్వరుణ్ణి ప్రసన్నం చేసుకుని)
హే! పార్వతీనాధ కైలాస  శైలాగ్రవాసా శశాంకాగ్రమౌళి ఉమాదేవతోల్లాసి  సవ్యాంగభాగా 
స్మితానందదాయిత్రి శ్రితాపాందా భస్మీకృతానంద గంగాధరా సర్వసంతాపహరా  హరా

నర్తనశాల

(అర్జునుడు ఊర్వశికి ద్రౌపది పాండవుల బంధం వివరిస్తూ)
ఆడితప్పని మాయమ్మ అభిమతాన సత్యమెరిగిన వ్యాసుని శాసనాన
పడతికి ఈశ్వరు డొసగిన వరబలాన నడచుచున్నట్టి ధర్మబంధమది వనితా

(బృహన్నల ద్రౌపది కి ధర్మరాజు గొప్పతనాన్ని వివిరిస్తూ)
ఎవ్వని వాకిట  ఇహపర పంఖంబు రాజభూషణ  రజోరాజినడగు
ఎవ్వాని చారిత్రమెల్ల   లోకములకు ఒజ్జయై వినయంబు నొరపుగరపు
ఎవ్వాని కడకంట నిర్వచుల్లెడిచూవె మానిటసంపదలీనుచుండు
ఎవ్వాని గుణలతలేడు వారాసుల కడపటి కొండపై కలయబ్రాకు
అతడు భూరిప్రతాప మహాప్రదీప దూరవికటిత గర్వాంధకార వైరివీర కోటీర
మనిగ్రుని వేష్టితాంగితనుడు కేవలమత్యుడే ధర్మసుతుడు

(అర్జునుడు ఉత్తర కుమారునికి కౌరవసేనలోని  వీరులను చూపిస్తూ  )
అదిగో
కాంచనమయవేదికా  కనక్కేతనోజ్వల విభ్రమమువాడు కలశజుండు
సింహలాంగూల భూషితనభోభాగ కేతు ప్రేంఘనమువాడు ద్రోణసుతుడు
కనక గోవృష సాంద్రకాంతి  పరిష్కృత ధ్వజ సముల్లాసంబువాడు కృపుడు
లలిత కంబుప్రభాకలిత పతాకావిహారంబువాడు  రాధాత్మజుండు
మణిమయోరథ   రుతిజాలమహితమైన   పడగవాడు కురుక్షితిపతి
మహొగ్రశిఖర ఘనతాళతరువగు శిరమువాడు సురనరీసూనుడు ఎర్పడజూచికొనుము.

(అర్జునుడు సుయోధనుడితో  యుద్ధం చేసేముందు)

ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరా  పురవీధుల జాలగలరే
మణిమయంబైన భూషణజాలములనొప్పి  యెడ్దోల గంబున  నుండగలరే
కర్పూరచందన కస్తూరికాదుల ఇంపుసొంపార  భోగింపగలరే
అతిమనోహరలగు చతురాంగనలతోడ సంగతివేడ్కలు సలుపగలరే
కయ్యముననోడిపోయిన కౌరవేంద్ర వినుము నాబుద్ధిమరలి ఈ తనువు విడచి
సుగతివడయుము  తొల్లింట చూరగలరే, జూదమిచ్చటనాడంగరాదు   సుమ్ము

భూకైలాస్

(నారదుడు రావణ బ్రహ్మ తో తనను చంపవచ్చినప్పుడు)
సైకత లింగమ్ము జలధిపాడౌనాడు తల్లికిచిన మాట తప్పినావు
కరుణించవచ్చిన కైలాసనాధుని అడుగరాని వరములడగినావు
అఖిల లోకారాధ్యయౌ జగన్మాతను వలపు పలుకుల మది గెలచినావు
పాపములు పండి నరకగర్బమ్ములో కూరుచున్న నీపై జాలిబూని
కావగావచ్చిన నాదు ఉపకారమునకు నీవొసంగు ఉపాయనంబిదియే కూరా 

భీష్మ


(భీష్ముని   చంపుతానని కృష్ణుడు చక్రం చేపట్టినప్పుడు)
కుప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగనభాగంబెల్ల గప్పికొనగా
ఉరికిన నోర్వక ఉదరంబులోనున్న జగముల వేగున ఎగసి  కదలా
చక్రంబు చేపట్టి చనుదెంచు రయమున పైనున్న పచ్చని పటముజార
నమ్మితి నాలావు నగుబాటు సేయక మన్నింపుమని పీటి మరలకితువా
కరికి లంఘించు సింగంబు కరణి మెరసి నేడు భీష్ముని జంపుదు నిన్నుగాతు
విడువుమర్జునా యని నాదు విశిజవృష్టి  తెరలి చనుదెంచు దేవుండు దిక్కునాకు

శ్రీక్రిష్ణ విజయం


పద్యాలు
(నారదుడు కృష్ణుని అష్ట భార్యలతో చూచి)
రత్నములవంటి అష్ట భార్యలకు తోడు శోయగముగల్గు ఇంకొక్క సుదతి యున్న
ఆహా ! నవరత్న హారమే అమరు నీకు కాంచి తరించు భాగ్యమ్ము కలుగు నాకు

(కృష్ణుడు పౌండ్రకుడి   తో ఆయుధవిసర్జనకు వచ్చినపుడు)
పనివడి నీవు కోరినటు   హహ..హహ హ   పనివడి నీవు కోరినటు
భట్టులలో పెను భట్టులైన నీ జనముల బ్రోల ఆయుధ విసర్జన
చేయగనెంచి  వచ్చితిన్
అనువుగా  దేనినిన్ విడువమందువో  ముందుగ నీవే దెల్పుము
ఘనతర చక్రరాజమున,  ఖడ్గమున, గదనా, ధనస్సునా దేనినిన్ విడువ మందువో నీవే దెల్పుమా

లక్ష్మీకటాక్షం


శుక్రవారపు పొద్దు సిరిని విడువొద్దు
దివ్వెలుండగ   వద్ది బువ్వలిట్టొద్దు
తోబుట్టువుల మనసు కష్టపెట్టొద్దు 
తొలిసంధ్య మలిసంధ్య నిదురపోవద్దు  
మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు
మా తల్లి వరలక్ష్మి నినువీడదపుడు

ఇల్లాలి కంటతడి పెట్టనీఇంట కల్లలాడని  ఇంట
గోమాత  వెంట ముంగిళ్ళ ముగ్గుల్లో   పసుపు గడపల్లో
పూలల్లో పాలల్లో   ధాన్యరాశుల్లో
మా తల్లి మహలక్ష్మి స్థిరముగా నుండు
మా తల్లి మహలక్ష్మి స్థిరముగా నుండు

పాండురంగ మహత్యం

కస్తూరీతిలకం లలాటఫలకే వక్షస్తలే కౌస్తుభం
నాసాగ్రే నవమౌక్తికం కరతలే వేణుం కరే కంకణం
సర్వాంగే హరిచందనంస కలయం కంటేశ ముక్తావళి
గోపత్నీ పరివేస్తితోం విజయతే గోపాల చూడామణి విజయతే గోపాల చూడామణి 

లవకుశ

(వాల్మీకి సీతను  తన ఆశ్రమములో ఉండమని చెబుతూ )
ఇదెమన ఆశ్రమంబు  ఇచ్చటనీవు వశింపుము లోకపావని
సదమలవృత్తి  నీకు పరిచర్యలు చేయుదురీ తపస్వినుల్
ముదముగా రామనామము   ముదముగా రామనామము
తపోవనమెల్ల ప్రతిధ్వనించు నీ పదములు  సోకి    మా యునికి
పావనమై చెలువొందు నమ్మరో

(వశిష్టుడు  శ్రీరామచంద్రుని పట్టాభిషేకం  సమయంలో) 
నవరత్నోజ్వల కాంతివంతమిది  ధన్యంబైన  సూర్యాన్మయోద్భవ రాజన్యులుమున్ను దాల్చి గరిమన్ పాలించిరీభూమి   కౌస్తవనీయంబగు ఈ కిరీటము శిరోదార్యంబు నీకీయెడన్   భువి  పాలించు  ప్రజానురంజకముగా మోదంబుతో రాఘవా

(లవకుశులు  శ్రీరామున్ని మొదటి సారి  చూసి  )
శ్రీరాఘవం ధశరాదాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం
ఆజానుబాహుం   అరవిందదళాయతాక్షం    రామం నిశాచరవినాశకరం నమామీ

దాన వీర శూర కర్ణ పద్యాలు


(కృష్ణుడు భీముడితో రాయభారానికి వెళ్లేముందు )
నిదురవో చుంటివో !  లేక బెదరి పలుకుచుంటివో!  కాక తొల్లింటి భీమసేనుడవే కావో,
అవ్వ! ఎన్నడీ చెవులు వినని కనులు చూడని శాంతంబు కానవచ్చే, నిదురవో చుంటివో !
కురుపతి పెందొడల్ విరుగగొట్టెద,  రొమ్ము  పగల్చి వెచ్చనెత్తురు కడుపార గ్రోలి
దుర్మద దుష్టుని దుస్ససేనును భీకర గధచేత యని  ప్రగల్భము లాడితివి అల్ల కొల్వులో
మరల ఇదేల ఈ పిరికి మానిసి పల్కులు మృష్టభోజనా
నిదురవో చుంటివో ! లేక బెదరి పలుకుచుంటివో !  కాక  నీవు తొల్లింటి భీమసేనుడవే కావో !

(అర్జునుడు కృష్ణునితో రాయభారానికి వెళ్లేముందు )
పాలడుగంగ కౌరవ పాలికింబోవ పాలు తెరంగెరింగింపుము
భీమ భూపాలుని పాలు తాను, తన పాలిటి రాజ్యము అన్నపాలు
భూపాల కుమారవర్గమది ఒక పాలది  మా అభిమన్యుపాలు 
నా పాలు సమస్త సైన్యమని తెల్పుము పంకజనాభ అచటన్ 

(కృష్ణుడు పాండవులతో రాయభారానికి వెళ్లేముందు )
ఐనను పోయిలావలయు హస్తినకు, అచట సంధి మాట ఎట్లైనను
శత్రురాజుల బలాబల సంపద చూడగవచ్చు , మీ విధానము, తత్సమాధానమును
తాతయు, ఒజ్జయు విందు రెల్లరున్. ఐనను పోయిలావలయు హస్తినకు.

(కృష్ణుడు కురు సభలో రాయభారానికి వచ్చి  )

తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్ట పడవరేని ఐదూళ్లిమనిరి   ఐదుగురకు
ధర్మంబుగా నీతోచినట్లనుపుము వారిన్

తనయుల వినిచెదవో లేక ఈ తనయులతో యేమియని స్వతంత్రించెదవో
చనుమొక దారిని లేదేని అనియగు వంశక్షయంబునగు కురునాధా

(ఒకవేళ మీకీ సంధి ఆమోదయోగ్యం కానియెడల జరుగబోవు విపరీత విపత్కర పరిణామములు  కూడా తెలియజెప్పెదను వినుము)
చెల్లియో చెల్లకో తమకు చేసిన యగ్గులు సైచిరందరున్, తొల్లి గతించె, నేడు నను దూతగా బంపిరి  సంధిసేయ,  మీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింప పొందుచేసెదో  యెల్లి రణంబె కూర్చెదవో ఏర్పడజెప్పుము  కౌరవేశ్వరా.

(అటుల సంధికొడంబడని యేని  )
అలుగుటయే యెరుంగని మహామహితాత్ముడజాతశత్రుడే అలిగిననాడు
సాగారములన్నియు ఏకము గాకపోవు  హ!  ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము విపన్నుల  లోకుల  గావుమెల్లరున్

జెండాపై కపిరాజు ముందు శ్రితవాజిశ్రేణియున్ పూన్చి   నే దండంబుంగొని తోలు  శ్యందనముమీదన్ నారిసారించుచును  గాండీవమ్ము ధరించి ఫల్గుణుడు మీ మూకన్ చ్చెండుచున్నప్పుడు ఈ కర్ణులు పదివేవురైన అని నొత్తురు చత్తురు రాజరాజ నా పలుకులు విశ్వసింపుము ఒక్కండును ఒక్కండును నీమొర ఆలకింపడు  కురుక్ష్మానాధ సంధింపగన్

సంతోషమ్మున సంధి సేయుదురే ! వస్త్రంబూడ్చుచో ద్రౌపదీ కాంతన్ జూచి చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతన్ నీ  సహజన్ము రొమ్ము రుధిరమ్మున్ ద్రావునాడైన సంతోషమ్మున సంధి సేయుదురే ! నిశ్చిన్తన్ తద్గధయున్  ద్వదూరుయుగమున్ చ్చేధించు నాడేనియున్,  హహహ..   సంతోషమ్మున సంధి సేయుదురే !

(కృష్ణుని రాయభారానికి సుయోధనుని ప్రత్యుత్తరం )
(ఆ కౌంతేయులు నిర్విక్రపరాక్రమసమపేతులేని, , ప్రచండ దౌర్జన్యమండితులేని.. అరివీర భయంకరులేని సంగరమునకు సమాయత్తపడక ఐదూళ్లిమ్మని ఇట్లు దేహి దేహి దేహియని దేవిరింతురే హ !)
సమరము సేయరే బలము చాలిన నల్వురు చూచుచుండ పెండ్లము పెరవారిచే
కటకటంబడ చూచుచు ఊరకుందురే ! మమతయు , గొంకు, మానమవమానమును
సిగ్గును లేనివారి నెయ్యం తగునయ్యా , అవ్వ ! భూమిపతులందరూ నవ్వర టయ్యా   సంధిచేసినన్.
(కృష్ణుడు తనని సాయమడగటానికి వచ్చిన అర్జునిడిని చూసి )

అర్జున నీవా ...)
ఎక్కడనుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులేకదా ? యశోభాక్కులు నీదు అన్నలును ,
భవ్య మనస్కులు నీదు తమ్ములును చక్కగా నున్నవారే ? భుజశాలి వృకోడరుడగ్రజాజ్ఞకు  దక్కగనిల్చి శాంతిగతి తాను చరింతునే తెల్పుమర్జునా .

(కృష్ణుడు  తనని సాయమడగటానికి వచ్చిన సుయోధనుడిని చూసి )
బావా ఎప్పుడు వచితివీవు ? సుఖులే భ్రాతల్ సుతుల్ చుట్టముల్ ? నీ వాల్లభ్యము  పట్టు కర్ణుడును నీ మేల్గోరు ద్రోణాది భూదేవుల్ సేమముమై మెసంగుదురే నీ తేజంబు హెచ్చించుచున్

(దుర్యోధనుడు కృష్ణుడి తో )
కౌరవ పాండవుల్ పెనగుకలము చేరువ అయ్యే మాకును అవ్వారికిని ఎక్కుడగు
బంధుసముద్రుడ వీవుగాన సాయముగోరగా యేగుదెంచితిని  గోపకులైకశిరోవిభూషణ
కౌరవ పాండవుల్ పెనగుకలము చేరువ అయ్యే .

(కృష్ణుడు సుయోధనుడితో )
ముందుగ వచ్చితీవు, మునుముందుగ అర్జుని నేను జూచితిని
బందుగులన్న అంశమది పాయకనిల్చె , సహాయమిర్వురున్ చెందుట పాడి
మీకునైజేసెద సైన్య విభాగంబు అందు మీకున్ మీకున్ తగు దాని గైకొనుడు
బావా, కోరుట బాలుని కొప్పు ముందుగన్

ఆయుధమున్ ధరింప అని ఖగ్గముగా ఒకపట్ల  ఊరకే సాయముచేయువాడ
పెలుచన్నను పిమ్మట యెగ్గులాడినన్  దోయిలియొగ్గుదున్  నిజము దొల్త వచించితి   కోరికొమ్ము నీకేయది ఇష్టమో కడమ యీతనిపాలగు పాండునందనా.

(అర్జునుడు  కృష్ణుడి తో)
నందకుమార యుద్ధమున  నా రధమందు వసింపుమయ్య 
మధ్యందిన భానుమండల విధంబున నీదగు కల్మిజేసి నా స్యందనమొప్పుదుగాక    
రిపు సంతతి తేజము తప్పుదుగాక నీ వెందును ఆయుధమ్ము దరికేగమికొప్పుదుగాక కేశవా

(కృష్ణుడు కర్ణుడిని పాండవుల పక్షం చేరమని ప్రలోభపెట్టే   సన్నివేశంలో )
అంచితులయిన బంధుగుల అందరిముందు  చెప్పి నిన్ను మెచ్చించెద
కుంతిచేత రవిచేత ఇది నిజంబు నిజంబని నీకు సాక్ష్యమిప్పించెద
ఫల్గుణ ప్రముఖ వీరులు గొల్వగా ఎల్లభూమి యేలించెద అచ్చకీర్తివిమలీకృత   సర్వదిగంతంబునన్

(బావా !  నీవిక సూతపుత్రుడివిగా సుయోధన దయాలబ్ధమైన అంగ రాజ్యధినేతవుగా
మనవలసిన  అవసరములేదు. పవిత్ర చంద్రవంశోద్భవుడవై   చతుసముద్రముద్రిక ధరావలయాన్ని పరిపాలించావలిసిన సమయం ఆసన్నమైనది )

యే సతి వహ్నిలోన జనియించెనో జన్న మొనర్చు వేళ
మున్నేసతి పెండ్లినాడు నృపులెల్ల   పరాజితులైరి కిరీటిచే
యే సతి మీది మొహమున ఇంతలు జేసిరి రాజు నీవు
నిన్నాసతి పెండ్లియాడగలదు ఆరవ భర్తగా సూర్యనందన

(కర్ణుడు కృష్ణుడితో )
(శ్రీకృష్ణ పరమాత్ముడవైన నీకీ  చేతలు సాద్యం కావచ్చు కాని  మానవమాత్రుడనైన
నాకు అవుననే సాహసం లేదు )
సూతుని చేతికిన్ దొరికి  ఆసూతకళత్రము  పాలుద్రావి    
సూతుని అన్నమున్గుడిచి సూత కులాంగన యందు నందనంవ్రాతము గాంచి
నేటికొక రాజకుమారుడనంచు దెల్ప  నా చేతము  సమ్మతించునే ఇస్సీ ఎవ్వరేగతి సిన్గ్గుమాలినన్

(అతి పవిత్రమైన నడవడిక తో మానవోచిత ధర్మకర్మబద్ధుడనై   ఇంతవరకు మనుగడ సాగించాను  ఈ వయస్సులో సామాన్య మానవ ప్రలోభాలకు లోనై ధర్మ ద్వంసం చేయలేను. పతివ్రతను మాతృ సమానురాలైన మానవతిని నా మరదలిని, కృష్ణా ! ఆలిగా అంగీకరించలేను )
కామము చేతను గాని భయ కంపిత చిత్తము చేతగాని
ఈ భూమి సమస్తము నేలుకొను పూనిక చేతనెగాని
నేను నా సేమమెగోరి  చుట్టముల, స్నేహితులన్ విడనాడి
మత్స్వామి సుయోధనున్ విడచి వత్తునే హహః వచ్చిన మెత్తురే జనుల్